మొయినాబాద్ ఫామ్‌హౌసు డ్రగ్స్ కేసుని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు విచారణ కొరకు సిట్ ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. సీపీ సుధీర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (ఏ-1)గా కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు రితేష్ రెడ్డి, నమిత్ మిశ్రాలకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ముగ్గురినీ చంచల్ గూడా జైలుకి తరలించారు. మిగిలిన 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు.
ఈ నెల 14వ తేదీ రాత్రి రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫామ్‌హౌసులో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగిల్ టీమ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు సోదాలకు వెళ్ళారు. వారిని బెదిరించేందుకు ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారు.
మాదక ద్రవ్యాలు సేవించడమే నేరం. ఆ మత్తులో పోలీసులను తుపాకీతో బెదిరించడం ఇంకా పెద్ద నేరం. అందుకే దీనిని ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ముఖ్యంగా వారికి మాదక ద్రవ్యాలు ఎవరు సరఫరా చేస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ముఠాలో ఎవరెవరున్నారు? వంటి వివరాలు సేకరించాల్సి ఉంది. కనుక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.