జీవన్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై!

March 17, 2026


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమేనని స్వయంగా చెప్పారు. సోమవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ, “నాకు, నా మాటకు గౌరవం ఈయని కాంగ్రెస్‌ పార్టీలో ఇక కొనసాగాలేను. నేను కాంగ్రెస్‌ సిద్దాంతానికి కట్టుబడి పనిచేశాను. కనుక వేరే పార్టీలో చేరాలనే ఆలోచన లేదు. నా అనుచరులు, శ్రేయోభిలాషులతో చర్చించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా,” అని అన్నారు. 

జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ సిఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌ ఇంత వరకు స్పందించలేదు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అదివారం రాత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి సుమారు అర్ధగంటసేపు మాట్లాడారు. వారే ఆయనను జీవన్ రెడ్డి వద్దకు పంపారా? లేక జీవన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకే తనంతట తానే వెళ్ళారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

కానీ జగిత్యాల పట్టణంలో జీవన్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్‌ నేతల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీ బ్యానర్లన్నీ తొలగించేసి, కేవలం జీవన్ రెడ్డి ఫోటోతో ఉగాది శుభాకాంక్షల ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడటం ఖాయమే. ఎల్లుండి అంటే మార్చి 19న ఉగాది పండుగ రోజున తన నిర్ణయం ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లున్నారు. 


Related Post