తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షో కాజ్ నోటీస్ జారీ చేసింది. ఇటీవల మొయినాబాద్ ఫామ్‌హౌసులో మాదక ద్రవ్యాలతో పార్టీ చేసుకుంటూ ఈగిల్ టీమ్‌కు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా అయనకు డ్రగ్ టెస్ట్ చేయగా మాదక ద్రవ్యాలు సేవించినట్లు నివేదిక వచ్చింది. కనుక పోలీసులు ఆయనతో సహా పలువురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా వారికి రెండు వారాలు రిమాండ్ విధించింది.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదట తమ పార్టీ నాయకులని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపించినప్పటికీ, అయన మాదక ద్రవ్యాలు సేవించి జైలుకి వెళ్ళడంతో బీఆర్ఎస్ పార్టీ ఆయనకు షో కాజ్ నోటీస్ జారీ చేసింది.
ఈ వ్యవహారం వలన పార్టీ విస్వసనీయతకు, ప్రతిష్టకు భంగం కలిగిందని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడింది. కనుక వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని సూచించింది. ఒకవేళ అది సంతృప్తికరంగా లేకపోతే పార్టీ కటిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. పార్టీ తుది నిర్ణయం తీసుకునేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ రోహిత్ రెడ్డిని ఆదేశించింది.