ఇలా కూడా ప్రతీకారం తీర్చుకోవచ్చా?

January 30, 2026


img

పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన ప్రభాస్‌ పరువుని దర్శకుడు మారుతి ‘రాజాసాబ్‌’తో గంగలో కలిపారని అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దానికి తోడు సినిమా ఫ్లాప్ అయితే అభిమానులు నా ఇంటికి రండంటూ సినిమా రిలీజ్ ముందు మారుతి అన్న మాటలు కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు. 

సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే అభిమానులు మారుతి నివాసం ఉంటున్న కొండాపూర్‌లోని ‘కొల్ల లగ్జరీ’కి బయలుదేరి వెళ్ళారు. కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సినిమా బాగోలేదని టాక్ వస్తే, ఆ కధ మీకు అర్థం కాలేదంటూ మారుతి చెప్పిన జవాబుతో అభిమానులు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు. 

అప్పటి నుంచి వారందరూ మారుతిపై పగబట్టినట్లు ఆయన పేరిట స్విగ్గీ, జోమోటో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ ద్వారా ఆన్‌లైన్‌లో వరుసగా ఆర్డర్లు పెడుతున్నారు. అయితే వారు ‘క్యాష్ ఆన్‌ డెలివరీ’ ఆప్షన్ టిక్ చేసి బుకింగ్స్ చేస్తుండటంతో ఆయన ఇంటికి ఆయా ఉత్పత్తులు, ఆహార పదార్ధాలతో డెలివరీ బాయ్స్ క్యూ కడుతున్నారు. వారిని చూసి సెక్యూరిటీ సిబ్బంది, దర్శకుడు మారుతి కూడా తల పట్టుకుంటున్నారు. 

మారుతి పేరిట, ఆ చిరునామాతో పంపిన ఆర్డర్స్ అన్నీ రిజక్ట్ చేస్తుండటంతో ఇప్పుడు మారుతి, కుటుంబ సభ్యులు నిజంగా ఏదైనా కావాలన్నా బుకింగ్ తీసుకోని పరిస్థితి నెలకొంది. కానీ ముందుగానే పేమెంట్ చేసి డెలివరీ తీసుకునే ఆప్షన్ ఉంది కనుక బ్రతికిపోయారు.


Related Post

సినిమా స‌మీక్ష