ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మాజీ సిఎం కేసీఆర్‌కి నిన్న మరోసారి నోటీస్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలోనే విచారణ జరుపుతామని, ఆ సమయానికి కేసీఆర్ అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు పేరుతో తమని వేధిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌కి సిట్ నోటీస్ ఇస్తేనే బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా హడావుడి చేస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరైతే వారి హడావుడి ఇంకా ఎక్కువవుతుంది.
కనుక ఈ విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతల వాదనలు, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం, బయట వారి పార్టీ శ్రేణులు చేస్తున్న హడావుడితో వారి పార్టీకి కూడా మున్సిపల్ ఎన్నికలలో సానుభూతి ఓట్లు పొందే అవకాశం లభిస్తుంది.
కనుక ఇలాంటి కీలక సమయంలో వారికి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతుండటం వలన కాంగ్రెస్ పార్టీయే ఎంతో కొంత నష్టపోతుంది. సానుభూతి ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత లబ్ది పొందుతుందని భావించవచ్చు.