తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమం మాట్లాడుతూ, “బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్‌ని తెలంగాణ జాతిపిత అని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. దేశం కోసం పోరాడిన జాతిపిత మహాత్మా గాంధీ ఒక్క పైసా వెనకేసుకున్నారా? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్క పదవి తీసుకున్నారా? లేదే! స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికే తూటాలకు బలైపోయారు కదా?
కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఏం చేశారు?పదేళ్ళ పాలనలో కేసీఆర్ కుటుంబంలో ప్రతీ ఒక్కరూ వందల ఎకరాలలో ఫామ్‌హౌసులు, వేలకోట్లు ఆస్తులు పోగేసుకున్నారు. ఇన్ని ఆస్తులు మీరెలా సంపాదించారో ప్రజలకు చెప్పగలరా?
తెలంగాణతో మీరందరూ బాగు పడ్డారు కానీ సామాన్య ప్రజల బతుకులు అలాగే ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చేయకూడని పనులన్నీ చేసి తనని తాను జాతిపిత అని ప్రకటించుకుంటే, బీఆర్ఎస్ పార్టీ అలా ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటు.
అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా అవినీతి, అక్రమాలకు పాల్పడినా ఎవరూ ప్రశ్నించకూడదంటే ఎలా? మీరు అవినీతి, అక్రమాలకు పాల్పడకపోయుంటే కేసు విచారణ ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నారు?మీ పార్టీ శ్రేణుల చేత ఎందుకు ఇంత హడావుడి చేయిస్తున్నారు?
మీ అవినీతి, అక్రమాలను చూసే ప్రజలు మిమ్మల్ని గద్దె దించారు. అయినా మీ తీరు మారలేదు. మీరు చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు ఎందుకు బాధ్యత వహించాలి? మీ కేసులు... మీ సమస్య. వాటిని ప్రజలకు ఎందుకు ఆపాదించి రెచ్చగొడుతున్నారు?” అని సిఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి సూటి ప్రశ్నలు వేశారు.