నేను విచారణకు రెడీ: కేసీఆర్‌

February 01, 2026


img

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు నంది నగర్‌ నివాసం విచారణకు అందుబాటులో ఉండాలంటూ మాజీ సిఎం కేసీఆర్‌కు సిట్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిపై ఆయన తన న్యాయవాదులు, పార్టీ ముఖ్య నేతలతో సుదీర్గంగా చర్చించిన తర్వాత సాయంత్రం ఆరు పేజీలతో జవాబిచ్చారు. 

దానిలో సిట్ నోటీస్ ఇవ్వడంపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పలు సుప్రీంకోర్టు కేసులను ప్రస్తావిస్తూ ఈవిధంగా నోటీస్ ఇచ్చి కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిందని పేర్కొన్నారు. అసలు సిట్‌కు తనకు నోటీస్ ఇచ్చే అధికారమే లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి, చట్టాలను గౌరవించే పౌరుడిగా నేడు మధ్యాహ్నం 3గంటలకు నంది నగర్‌ నివాసం విచారణకు అందుబాటులో ఉంటానని లేఖ ద్వారా తెలియజేశారు. 

కేసీఆర్‌ విచారణకు సిద్దమని చెప్పారు కనుక సిట్‌ అధికారులు అయన అభ్యంతరాలను పక్కన పెట్టి విచారణకు ముందస్తు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఆయన విచారణని వ్యతిరేకిస్తూ భారీగా బీఆర్ఎస్‌ పార్టీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంటుంది. కనుక హైదరాబాద్‌ సీపీ, సిట్‌ అధినేత విసి సజ్జనార్‌ పోలీస్ అధికారులతో నిన్న సాయంత్రమే సమావేశమై నంది నగర్‌ వద్ద బందోబస్తు ఏర్పాట్ల గురించి చర్చించి ఆదేశాలు జారీ చేశారు. 

నేడు నంది నగర్‌తో సహా పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మొహరించబోతున్నారు. అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనవచ్చు కనుక ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి వాహనాలను వేరే మార్గాలకు మళ్ళించే అవకాశం ఉంటుంది.  


Related Post