ఏటా దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సు జరుగుతుంది. దానికి భారత్‌తో సహా అనేక దేశాల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులు, నిపుణులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతుంటారు. సిఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్ సదస్సులో పాల్గొన్నప్పుడు ప్రపంచ ఆర్ధిక సదస్సు మేనేజింగ్ డైరెక్టర్ జేరిమీ జర్గాన్స్, తదితరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
పరిశ్రమలు, పెట్టుబడి అవకాశాల గురించి, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి ఏడాదికి ఒకమారు దావోస్ సదస్సులో కలిసి చర్చించుకోవడం చాలా బాగుంది. కానీ అభివృద్ధి వేగవంతం కావాలంటే ఏడాదికి ఒకమారు సరిపోదని కనీసం రెండుసార్లు ఈ సదస్సు నిర్వహణ అవసరమని చెప్పారు.
దావోస్ సదస్సుకి కొనసాగింపుగా ఏటా జూలై నెలలో హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్ధిక సదస్సు నిర్వహించాలని సిఎం రేవంత్ రెడ్డి బృందం విజ్ఞప్తి చేసింది. దీనిపై జేరిమీ జర్గాన్స్ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనపై ఆలోచించుకొని త్వరలో తమ నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు వారు అంగీకరిస్తే ఇకపై ప్రపంచ ఆర్ధిక సదస్సుకి హైదరాబాద్ కూడా వేదికగా నిలుస్తుంది.