కవిత దీక్షతో వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం!

March 11, 2026
img

ఇటీవల ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో పేదల ఇళ్ళని జిల్లా అధికారులు కూల్చివేస్తే బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, ఆ పార్టీ నేతలు హడావుడి చేసి వెళ్ళిపోయారు. కానీ తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాస్త ఆలస్యంగా వచ్చినా నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ స్థానిక అంబేద్కర్ భవన్‌లో సోమవారం నిరాహార దీక్ష చేశారు. దాంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. 

పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి హైదరాబాద్‌ తరలించినప్పటికీ, వెంటనే జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెలుగుమట్ల నిర్వాసితులకు న్యాయం చేస్తామని, అదే స్థలంలో వారికి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. 

మంగళవారం నుంచే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వాసితులను గుర్తించి, వారికి త్వరలో నిర్మించబోయే ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తూ టోకెన్లు ఇచ్చారు. వెలుగుమట్లలో సుమారు 750 కుటుంబాలు ఉండగా వారిలో మొత్తం 412 మందిని అర్హులుగా గుర్తించారు. మొదటిరోజున వారిలో 300 మందికి అధికారులు టోకెన్లు జారీ చేశారు. మిగిలిన వారికి నేడు జారీ చేయనున్నారు. 

అయితే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అంటే రెండు మూడు నెలల్లో జరిగే పని కాదు. దానికి బడ్జెట్‌, భూకేటాయింపు, టెండర్లు, భూమిపూజ, నిర్మాణ పనులు... ఇవన్నీ ప్రభుత్వం ఎంత వేగంగా చేసినా కనీసం మరొక ఏడాది సమయం పడుతుంది. అంతవరకు నిర్వాసితులు అద్దె ఇళ్ళలో కాలక్షేపం చేయాల్సిందే. కానీ నిర్వాసితులకు అంత ఆర్ధిక స్తోమత లేదు గనుక ప్రభుత్వమే వారికి తాత్కాలికంగా ఎక్కడైనా సరైన ఆశ్రయం కల్పించగలిగితే వారూ హర్షిస్తారు. 


Related Post