నేడు బీసీ రిజర్వేషన్స్ కోసం జరుగుతున్న ‘తెలంగాణ బంద్’లో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో హైదరాబాద్, ఖైరతాబాద్ జంక్షన్ వద్ద మానవహారం కార్యక్రమం చేపట్టారు. దీనిలో ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నాడు.
విదేశాలలో చదువుకుంటున్న ఆదిత్య ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. బీసీ రిజర్వేషన్స్ కోసం తల్లి చేస్తున్న పోరాటంలో తాను మాత్రమే కాకుండా రాష్ట్రంలో ప్రతీ ఇంటి నుంచి విద్యార్ధులు, యువతీ యువకులు అందరూ పాల్గొనాలని ఆదిత్య అన్నారు.
నాడు తెలంగాణ సాధన కోసం ఏవిదంగా అందరూ కలిసికట్టుగా పోరాడి సాధించుకున్నామో బీసీ రిజర్వేషన్స్ కూడా అలాగే సాధించుకోవచ్చని ఆదిత్య అన్నారు.
కేసీఆర్ రాజకీయ వారసులుగా కేటీఆర్ ఉన్నారు. ఆయనకు తోడుగా హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత బహిష్కరించబడిన తర్వాత ఆమెకు తోడుగా కుటుంబ సభ్యులు కానీ, రాజకీయ నాయకులు గానీ ఎవరూ నిలబడలేదు.
కనుక తెలంగాణ రాజకీయాలలో ఒంటరిగా పోరాడుతున్న కల్వకుంట్ల కవితకు ఆమె కుమారుడు అండగా నిలబడటం ఆమెకు చాలా సంతోషం కలిగించే ఉంటుంది. కనుక భవిష్యత్తులో ఆమె రాజకీయ వారసుడిగా ఆదిత్య రాజకీయాలలో ప్రవేశించినా ఆశ్చర్యం లేదు.