బీసీ రిజర్వేషన్స్ సాధన కోసం నేడు తెలంగాణ బంద్ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్స్ పెంపు కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోని సుప్రీంకోర్టు త్రోసిపుచ్చడంతో, ‘బీసీ ఐకాస’ నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.
దీనికి అధికార కాంగ్రెస్ పార్టీతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు పలికాయి. బంద్‌లో పాల్గొంటున్నాయి కూడా. కనుక ఈరోజు తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలలోనే నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నీ బంద్ అయ్యాయి. కనుక బంద్ విజయవంతం అయినట్లే భావించవచ్చు.
బీఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’తో రాజకీయాలు చేస్తూ తన రాజకీయ ప్రత్యర్ధులపై పైచేయి సాధిస్తోంది. కనుక దాని సెంటిమెంట్ రాజకీయాలు కట్టడి చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ‘బీసీ రిజర్వేషన్స్’ అంశం తెరపైకి తెచ్చి ఉండవచ్చు.
కానీ పార్లమెంటులో చట్ట సవరణ కానిదే ఇది అమలు చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందే తెలుసు. కానీ కాంగ్రెస్‌కు వేరే ఆలోచనలున్నాయి. కనుకనే ఈ విషయంలో అది ముందుకే సాగింది. ఈ విషయం బీఆర్ఎస్, బీజేపిలకు కూడా బాగా తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ తమ కోసం తవ్వుతున్న గోతిలో అదే పడేలా చేసేందుకే అవి శాసనసభలో ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఉండవచ్చు.
అవి ఊహించినట్లే బీసీ రిజర్వేషన్స్ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురు దెబ్బలు తింది. కనుక నేడు అవి కూడా బంద్‌లో పాల్గొని కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాయి.