మజ్లీస్ మద్దతు కాంగ్రెస్‌ పార్టీకే!

October 17, 2025


img

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో మజ్లీస్ పార్టీ కాంగ్రెస్‌కి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్ యాదవ్‌ నేడు నామినేషన్ వేసేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. దానిలో మజ్లీస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు ఒక్క పార్టీ, ఒక్క అభ్యర్ధి సెంటిమెంట్ కానేకాదు. నియోజకవర్గంలో 3.9 లక్షల మంది ఓటర్ల సెంటిమెంట్. బీఆర్ఎస్‌ పార్టీ పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించింది కానీ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనేలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది కనుక కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్ యాదవ్‌ని గెలిపిస్తే ఆయన తప్పకుండా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాను. 

శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీ రాష్ట్రంలో పలు జిల్లాలలో ఓడిపోయినా హైదరాబాద్‌ ప్రజలు గెలిపించారు. కానీ వారి కోసం ఏమీ చేయలేకపోయింది. శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్‌ పార్టీకి 37 శాతం ఓట్లు పడగా వెంటనే జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అది 15 శాతానికి పడిపోయింది. ప్రజలు బీఆర్ఎస్‌ పార్టీని తిరస్కరించారని స్పష్టమైంది. 

కనుక ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలలో గెలిపిస్తారనుకోను. ఒకవేళ గెలిపించినా బీఆర్ఎస్‌ పార్టీ చేతిలో అధికారం లేనప్పుడు అది ఏం చేయగలదు?కనుక కాంగ్రెస్‌ అభ్యర్ధి నవీన్ యాదవ్‌ని భారీ మెజార్టీతో గెలిపించాలని,” అసదుద్దీన్ ఓవైసీ జూబ్లీహిల్స్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ముస్లిం జనాభా కూడా ఎక్కువే ఉంది. మజ్లీస్ అధినేత ఇంత బహిరంగంగా నవీన్ యాదవ్‌కు మద్దతు ప్రకటించినప్పుడు వారి ఓట్లన్నీ ఆయనకే పడతాయి. ఇది బీఆర్ఎస్‌ పార్టీకి చాలా నష్టం కలిగించవచ్చు.


Related Post