సైబర్ కేటుగాళ్ళు ఎమ్మెల్యేనే దోచేశారు!

October 19, 2025


img

సైబర్ నేరాలు జరుగుతున్న తీరు వాటి ఉదృతి చూస్తుంటే ఇప్పుడు ఎవరూ వాటి నుంచి తప్పించుకోలేరనిపిస్తుంది. వీటి గురించి అవగాహన లేని సామాన్య ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ ఏపీ ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకొని రూ.1.07 కోట్లు సమర్పించుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.  

ఆ ఎమ్మెల్యే బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 10న ఆయనకు ముంబై సైబర్ క్రైమ్‌ పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, ముంబయిలో కొనుగోలు చేసిన సిమ్ కార్డుల ద్వారా ఈ అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని కనుక మీపై కేసు నమోదు చేస్తున్నామని అవతలి వ్యక్తి చెప్పాడు. 

ఆ తర్వాత సైబర్ పోలీస్ ఆఫీసరుగా చెప్పుకున్న మరో వ్యక్తి వాట్సప్ వీడియో కాల్ ద్వారా ఎమ్మెల్యేతో మాట్లాడుతూ మీపై అరెస్ట్‌ వారెంట్ జారీ చేశామని, మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేస్తున్నామని బెదిరించాడు.  

కానీ తనకు ముంబాయిలో బ్యాంక్ అకౌంట్ లేదని ఎమ్మెల్యే చెప్పగా దానిలోకి కెనరా బ్యాంక్ నుంచి రూ.3.0 కోట్లు ఎలా వచ్చాయని ఆ వ్యక్తి ప్రశ్నించాడు. ఆ విషయం తనకు తెలియదని ఎమ్మెల్యే చెప్పారు.

కానీ ఆ సొమ్ము వెనక్కు తిరిగి ఇవ్వకపోతే అరెస్ట్‌ చేయాల్సి వస్తుందని బెదిరించాడు. దాంతో తీవ్ర ఆందోళన చెందిన ఎమ్మెల్యే 5 రోజుల వ్యవధిలో విడతల వారీగా మొత్తం రూ.1.07 కోట్లు సైబర్ నేరగాళ్ళకు పంపించారు. 

అక్కడితో వారు ఆగలేదు మళ్ళీ ఫోన్‌ చేసి కేసు ఉపసంహరణ, కోర్టు క్లియరెన్స్ కోసం మరో రూ.60 లక్షలు వెంటనే పంపించాలని కోరారు. కానీ అప్పటికే తాను మోసపోయానని గ్రహించిన సదరు ఎమ్మెల్యే హైదరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 


Related Post