దీపావళి మర్నాడు అంటే అక్టోబర్ 21 (ఆశ్వయుజ బహుళ అమావాస్య) నుంచి కార్తీక మాసం మొదలైంది. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో వేములవాడ, కాళేశ్వరం, రామప్ప, కొమురువెల్లి మల్లన్న,వేయి స్థంభాల గుడి, ఛాయా సోమేశ్వర స్వామి, కీసరగుట్ట తదితర ఆలయాలకు ప్రతీరోజూ తెల్లవారుజామునే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. భక్తులు వెలిగించే కార్తీక దీపాలతో ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయి.
ఆంధ్రాలో దక్షిణ కాశీగా పిలువబడే శ్రీశైలం, శ్రీకాళహస్తి, పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ది చెందిన ద్రాక్షరామం (కోనసీమ), క్షీర రామలింగేశ్వర స్వామి (పాలకొల్లు), అమరలింగేశ్వర స్వామి (అమరావతి) సోమేశ్వర స్వామి (భీమవరం)లో కూడా కార్తీకమాసం సందర్భంగా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది.
మిగిలిన మాసాలు, పండగలకు భిన్నంగా కార్తీకమాసం శివకేశవులిరువురికీ అత్యంత ప్రీతిపాత్రమైనది. కనుక శైవ క్షేత్రాలతో పాటు రెండు రాష్ట్రాలలో వైష్ణవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి.