ప్రభాస్-హను సినిమా టైటిల్‌ రేపే!

October 22, 2025


img

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేస్తున్న సినిమా పేరు ‘ఫౌజీ’ అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇది స్వాతంత్ర్య పోరాటాల చారిత్రిక నేపధ్యంతో తీస్తున్న సినిమా... పోస్టర్స్ కూడా అలాగే ఉన్నాయి. కనుక సినిమా టైటిల్‌ ‘ఫౌజీ’ అనే అందరూ అనుకుంటున్నారు. 

 ఆగస్ట్ 15న ఈ సినిమా టైటిల్‌ ప్రకటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ ప్రకటించలేదు. కానీ రేపు (గురువారం) సినిమా టైటిల్‌ ప్రకటించబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ రెండు రోజుల వ్యవధిలో రెండు పోస్టర్స్ వేసి తెలియజేసింది. 

మొదటి పోస్టర్‌లో అనేక వందల తుపాకుల వెనుక ప్రభాస్ నీడలా చూపారు. ‘అతడే ఓ ఒంటరి బెటాలియన్,’ అని పేర్కొనగా, ఈరోజు విడుదల చేసిన పోస్టర్‌లో పాండవుల పక్షాన్న కర్ణుడు... ఒంటరిగా నడుస్తున్న ఓ బెటాలియన్... 1932 నుంచి మోస్ట్ వాంటడ్‌,’ అంటూ ఆసక్తి రేకెత్తించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ వీడియోలో గాంధీ శాంతియుతంగా, అహింసా మార్గంలో పోరాడుదామని చెప్పగా నేతాజీ సుభాస్ చంద్రబోస్ అయనకు దణ్ణం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతారు. నేతాజీ రహస్యంగా ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆయన కోసం బ్రిటన్‌తో సహా పలు దేశాలు వెతికాయి. ఆయనను కాపాడుతూ శత్రువులపై విరుచుకుపడే సిపాయిగా ప్రభాస్ నటిస్తున్నట్లు ఈ ఫోటోలు, వీడియోలు కలిపి చూస్తే అర్ధమవుతుంది. అవునో కాదో రేపు స్పష్టత రావచ్చు. 

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌ ఇమాన్వీ నటిస్తోంది. అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.   

ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష