ఒకప్పుడు అనేక సూపర్ హిట్ సినిమాలు అందించిన దర్శక నిర్మాతలు, నటీనటులు ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతుంటారు.
అటువంటి అగ్ర దర్శకులలో గుణశేఖర్ కూడా ఒకరు. సమంతతో చేసిన ‘శాకుంతలం’ వారిరువురికీ చాలా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరు సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇద్దరికీ ఒక్క హిట్ పడటం లేదు.
ఇప్పుడు గుణశేఖర్ ఇఫోరియా (ఆనందం) అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులకు అర్ధం కాని పేరు ఎంత గొప్పదైనా, సినిమా చాలా బాగుంటే తప్ప వారు దానిని ఆదరించరని ఇప్పటికే పలుమార్లు నిరూపితమైంది.
సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉన్న గుణశేఖర్ తన ఆలోచనాస్థాయికి తగినట్లు తన సినిమాకు ఇటువంటి పేరు ఎంచుకొని ఉండవచ్చు. కానీ ఈ టైటిల్ సామాన్య ప్రేక్షకులకు, ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు అసలు ఎక్కాడు. కనుక సినిమా పేరుతోనే సగం అపజయం సిద్దం చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారనుకోవచ్చు.
ఈ సినిమాతో విగ్నేశ్ గవిరెడ్డి హీరోతో సహా మరో 20 మంది నూతననటీనటులు పరిచయం అవుతున్నారు. యువతని ఆకట్టుకునే సరికొత్త కధతో గుణశేఖర్ ఈ సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో పక్కా మాస్ బీట్ సాంగ్ ఒకటి ఉందని తెలుస్తోంది.
ఇప్పుడీ సినిమా పేరు, నటీనటులు, కధ అన్నీ కలిపి చూస్తే గుణశేఖర్ ఫ్లాప్ సినిమాల జాబితాలో ఇఫోరియా కూడా చేరుతుందనిపిస్తుంది. కాదని నిరూపించి దీంతో ఆయన హిట్ కొడితే చాలా సంతోషమే!