కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత కూడా కొన్ని నెలలపాటు తెలంగాణ జాగృతి కార్యాలయంలో తండ్రి ఫోటో పెట్టుకున్నారు. తండ్రి చిత్రం ఉన్న కండువాలే వేసుకు తిరిగేవారు.
కేటీఆర్ గురించి ఏమైనా మాట్లాడాల్సి వస్తే ‘రామన్న’ అంటూ మాట్లాడేవారు. బహుశః తండ్రి నుంచి పిలుపు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరుకోవచ్చనే ఆశ పడ్డారేమో? కానీ పిలుపు రాకపోగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి ఘాటుగా విమర్శలు, ఆరోపణలు వచ్చాయి.
అప్పుడే ఆమె తండ్రి ఫోటో, కండువాలు తీసేసి సొంత ఫోటో పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. శాసనమండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆమె అన్నని ఇదివరకులా రామన్న అనడం లేదు. అందరిలా ‘కేటీఆర్’ అని సంభోధిస్తున్నారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సికింద్రాబాద్‌ని జిల్లాగా చేయమని అడిగిన వారందరిపై కేసులు పెత్తిన్చిఒ జైల్లో వేయించింది మీరే. ఇప్పుడు కేటీఆరే సికింద్రాబాద్‌ని జిల్లాగా ఏర్పాటు చేయాలనికోరుతూ ర్యాలీ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉంది. గుంటనక్క, గుంపు మేస్త్రీ మద్య మంచి అవగాహన ఉంది. కనుక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదో జరిగిపోతుందని అనుకోలేము,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.