మాజీ మంత్రి హరీష్ రావు కొద్ది సేపటి క్రితం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, “నన్ను ప్రశ్నిస్తున్నంతసేపు విచారణాధికారులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. దీనిని బట్టి వారిపై రాజకీయంగా ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్దమైంది. ఈ కేసు అంతా ఒట్టి భూటకం, కాంగ్రెస్ ప్రభుత్వ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే,” అని అన్నారు.
తర్వాత నేరుగా తెలంగాణ భవన్‌కు వెళ్ళిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనని సిట్ అధికారులు ఏకంగా 7 గంటల సేపు ప్రశ్నించారు. ఈ కేసులో సాక్షిగా పిలిచి న్యాయవాదులను అనుమతించకుండా అన్ని గంటల సేపు ప్రశ్నించడాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు.
విచారణ కొనసాగుతున్న కొద్దీ క్రమంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకుంటుండటంతో పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కు పంపించే ప్రయత్నం చేశారు.
కానీ భారీ సంఖ్యలో తరలి వస్తుండటంతో పోలీసులు వారిని వ్యానులలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. మహిళా కార్యకర్తలను కూడా అదుపులో తీసుకొని వేరే పోలీస్ స్టేషన్‌కు తరలించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.