నేడు ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలలో సిఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ, “నాడు కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి కొట్లాడితేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి రెండు పార్టీలు ప్రజల కోసం కలిసే పనిచేస్తున్నాయి. బ్రిటిష్ పాలనలో విభజించి పాలించు విధానం అమలుచేసేవారు. ఇప్పుడు కేంద్రంలో బిజేపి ప్రభుత్వం కూడా అదే విధానంతో దేశ ప్రజల మద్య చిచ్చు పెడుతోంది.
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి జాతీయ గ్రామీణ ఉపాధి పధకాన్ని ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. దేశంలో పేదలను ఉక్కుపాదంతో అణచివేస్తూ కొన్ని కార్పోరేట్ కంపెనీలకు దేశాన్ని దోచిపెడుతోంది. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చినదే.
రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కుని ‘సర్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నిరుపేదలకు ఓటు హక్కు కూడా లేకుండా చేస్తోంది. రాహుల్ గాంధీ, కమ్యూనిస్టులు ఈ విషయాలన్నీ పేద ప్రజలకు వివరించి చెప్పడం వల్లనే ఈసారి బిజేపి 400 ఎంపీ సీట్లు ఆశిస్తే ప్రజలు 240 సీట్లు మాత్రమే ఇచ్చారు.
బిజేపి పాలన బ్రిటిష్ వారి పాలన కంటే చాలా ప్రమాదకరంగా మారింది, దీనిని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఈ పోరాటంలో మాకు ప్రజల సహకారం కూడా అవసరం,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.