బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఆయన చెల్లెలు కల్వకుంట్ల కవిత ఇద్దరి రాజకీయాలు చూస్తున్నప్పుడు అన్నాచెల్లెళ్ళలోనే ఇంత వ్యత్యాసమా? అనిపించక మానదు.
సిఎం రేవంత్ రెడ్డి ఓ సభలో కేటీఆర్ తండ్రి పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచి కేటీఆర్ “యస్! బరాబర్ చెప్పుకుంటా. నా తండ్రి తెలంగాణ తెచ్చిన మొనగాడు... అయన కొడుకునని చెప్పుకోవడానికి గర్వపడతా,” అన్నారు. ఇది ఒకసారి చెప్పుకుంటే వినేందుకు బాగుంటుంది. కానీ ఇటీవల చాలాసార్లు ఈ డైలాగ్ చెపుతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూ, కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకుంటున్న కేటీఆర్ ఇంకా తండ్రి పేరు చెప్పుకొంటూ రాజకీయాలు చేస్తుంటే, కల్వకుంట్ల కవిత మొదట్లో తండ్రి పేరు చెప్పుకున్నా ఇప్పుడు తండ్రి పేరు, ఫోటో పక్కన పెట్టి సొంత గుర్తింపు కోసం పట్టుదలగా కృషి చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ నీడలో నుంచి బయటపడి తన శక్తిసామర్ధ్యాలు నిరూపించుకొని అందరి చేత శభాష్ అనిపించుకున్న కేటీఆర్, పదవి అధికారం కోల్పోగానే ఆత్మవిశ్వాసం కూడా కోల్పోయినట్లున్నారు. కనుక తండ్రి పేరుతోనే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని, రావాలని ఆశ పడుతున్నారు. పదేపదే కేసీఆర్ భజన చేస్తున్నారు.
కానీ తెలంగాణ రాజకీయాలలో ఒంటరి పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవిత మాత్రం కొత్త పార్టీ పెడతానని ఎన్నికలలో పోటీ చేసి గెలుస్తామని చెపుతున్నారు. ఎప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానని ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నారు. కేటీఆర్‌లో ఈ ఆత్మవిశ్వాసం ఎందుకు లోపిస్తోంది?
సిఎం రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్లు తిడుతుంటే అందరూ చప్పట్లు కొడుతున్నారు కనుక అదే గొప్ప విషయమనుకుంటున్నట్లున్నారు. కల్వకుంట్ల కవిత దారి ఏర్పాటు చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తుంటే, కేసీఆర్ తండ్రి వేసిన బాటలో ఇంకా తడబడుతూ తప్పటడుగులు వేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.