ఫోన్ ట్యాపింగ్‌ కేసులో హరీష్‌ రావుకు నోటీస్

January 20, 2026


img

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్‌ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్‌ రావుకు సిట్ అధికారులు నోటీస్ జారీ చేశారు. ఈ కేసులో మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు సిట్ అధికారులు ఈ కేసుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అధికారులను ప్రశ్నించి వాంగ్మూలాలు తీసుకున్నారు. ఈ కేసులో బాధితులుగా పేర్కొనబడిన కేంద్రమంత్రి బండి సంజయ్‌తో సహా పలువురు రాజకీయ నాయకులను కూడా పిలిఛి వాంగ్మూలాలు తీసుకున్నారు. 

బీఆర్ఎస్‌ పార్టీలో ఇంతవరకు ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. మొట్ట మొదట హరీష్‌ రావుకి నోటీసు ఇచ్చారు. నిజానికి ఈ నెల 4వ తేదీనే తనకు నోటీస్ ఇవ్వబోతున్నారని హరీష్‌ రావు చెప్పారు. తనను అరెస్ట్ చేసినా భయపడబోనని చెప్పారు. కానీ తాజా నోటీసులో ఆయనని ‘సాక్షి’గా పేర్కొన్నారు.

ఈ కేసు, నోటీసు, విచారణ ఏ మలుపు తిరుగుతుందో తెలీదు కానీ హరీష్‌ రావు ఈరోజు ఉదయం తెలంగాణ భవన్‌కు వెళ్ళి అక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యి చర్చిస్తారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారని సమాచారం.


Related Post