భారత్ తల్లి..గురువు అన్నీ: ఏఆర్‌ రహమాన్

January 18, 2026


img

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్ ఓ ఇంటర్వ్యూలో అన్న చిన్నమాట పట్టుకొని సోషల్ మీడియాలో చాలా రాద్దాంతమే జరిగింది. “బాలీవుడ్‌లో దక్షిణాదివారి పట్ల వివక్ష ఉందా?” అనే ప్రశ్నకు “నేనెప్పుడూ అలాంటి వివక్ష ఎదుర్కోలేదు. గత 8 ఏళ్ళుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ నెలకొంది. సృజనాత్మకత లేనివారే ఇండస్ట్రీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 

దీనికి మత పరమైన కారణం కూడా ఉండవచ్చు. ఈ సమస్య నేరుగా నేను ఎదుర్కోలేదు. కానీ అటువంటి గుసగుసలు వినిపించాయి. అయితే నేనెప్పుడూ పని కోసం వెతకను. చిత్తశుద్ధి, సృజనాత్మకత ఉంటే చాలు పనే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని గట్టిగా నమ్ముతాను,” అని అన్నారు. 

ఈ మాటలపై పెద్ద దుమారం చెలరేగడంతో మళ్ళీ అయన స్పందిస్తూ, “భారత్‌ నాకు స్ఫూర్తి. ఈ దేశమే నా తల్లి, గురువు, ఇల్లూ అన్నీను. ఓ భారతీయుడుగా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేశం నాకెన్నో అవకాశాలు కల్పించింది. అందుకు నేనెల్లప్పుడూ ఈ దేశానికి రుణపడి ఉంటాను. నా సంగీతం ద్వారా నా భావాలను స్వేచ్చగా ప్రకటించడం, దేశ ప్రజలను ఉత్తేజపరచడం, నా ఈ స్థితికి కారణమైన సంగీతాన్ని గౌరవించడం, వీలైనంత సేవ చేయడమే నా లక్ష్యం. 

కొన్నిసార్లు ఒకరి ఉద్దేశ్యాలను మరొకరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని ఈ వివాదంతో తెలుసుకున్నాను. కానీ నేను ఎవరినీ బాధ పెట్టాలని కోరుకోలేదు. నేను నిజాయితీగా చెపుతున్నాను. అందరూ నన్ను అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను,” అంటూ ఓ వీడియో మెసేజ్ పెట్టారు.    


Related Post

సినిమా స‌మీక్ష