మూసీ ప్రాజెక్టుపై అన్ని కాకి లెక్కలే: బీఆర్ఎస్‌ పార్టీ

March 18, 2026


img

నేడు శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలవగానే మూసీ ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్‌, విపక్ష బీఆర్ఎస్‌ పార్టీల మద్య వాడి వేడిగా వాదోపవాదాలు సాగాయి. 

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “మూసీ ప్రాజెక్ట్ మొదటి దశకు డీపీఆర్ తయారైంది. అంచనా వ్యయం రూ.6500-7,000 కోట్లు. మొదటి దశ పనులలో 1,435 నిర్మాణాలు (ఇళ్ళు) తొలగించాల్సివస్తుంది. నిర్వాసితులందరికీ పునరావాసం, నష్టపరిహారం అందించడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నాము,” అని చెప్పారు. 

మంత్రి ప్రసంగంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుకి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ ప్రాజెక్ట్ పేరుతో ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతూ, పేద ప్రజల ఇళ్ళు కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. గెజిట్ నోటిఫికేషన్‌లో 10,000 ఇళ్ళు కూల్చివేయబోతున్నామని పేర్కొన్నారు. కానీ మంత్రిగారు1,435 ఇళ్ళు మాత్రమే అని చెపుతున్నారు. రెంటిలో ఏది నిజం?

ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మొదటి నుంచి నేటివరకు అన్నీ కాకి లెక్కలే చెపుతోంది. ఇది లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అని చెపుతూ మొదటిదశ అంచనా వ్యయం రూ.6500-7,000 కోట్లు అని చెప్పడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ. ఈ లెక్కన మొత్తం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది. ఇంకా ఎన్నివేల ఇళ్ళు కూల్చివేస్తారు? డీపీఆర్ సిద్ధమైతే దాని కాపీలు సభకు ఎందుకు ఇవ్వడం లేదు? సభలో వరుసగా ఇలా అబద్దాలు చెపుతూ ఉద్దేశ్యపూర్వకంగా సభని తప్పు దోవ పట్టిస్తున్నందుకు నిరసనగా వాకవుట్ చేస్తున్నాము,” అని కేటీఆర్‌ అన్నారు.          


Related Post