తెలంగాణ రాజకీయాలలో కవిత నిలబడగలరా?

March 18, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఓ రెండుమూడు నెలల వరకు కల్వకుంట్ల కవిత రాజకీయంగా సందిగ్ధంలో ఉన్నారు. కానీ ‘జనంబాట’ తర్వాత సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. మే నెలలో తన కొత్త పార్టీ ఏర్పాటవుతుందని కవిత చెప్పారు. 

రాజకీయంగా ఒంటరి ప్రయాణం చేయాలనుకోవడమే చాలా సాహసం. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకోవడం ఇంకా దుస్సాహసమే. ఎందుకంటే మరో రెండేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల వరకు నిత్యం సభలు, సమావేశాలు, ర్యాలీలు, దీక్షలు నిర్వాహించాలంటే భారీగా డబ్బు అవసరం. ఇతర పార్టీల ముఖ్య నేతలను ఆకర్షించి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ రెండూ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. 

ఆమె సొంతంగా పార్టీ నడిపించగలరని, భవిష్యత్‌లో మళ్ళీ బీఆర్ఎస్‌ పార్టీ లేదా మరో పార్టీలో విలీనం కారనే నమ్మకం ఇతర పార్టీ నేతలకు కలగాలి. కలిగితేనే వస్తారు. వస్తేనే ఈ ఖర్చులు అందరూ పంచుకుంటారు. ఆమెపై భారం తగ్గుతుంది. 

కానీ ఇంతవరకు ఆమె పార్టీ ఏర్పాటు కాలేదు కనుక ఎవరూ ఆమెతో చేతులు కలపలేదు. కనుక పార్టీ ఏర్పాటయ్యేవరకు ఈ నిర్వహణ ఖర్చులన్నీ ఆమె స్వయంగా భరించాల్సి ఉంటుంది. ఆమె వెంట నడుస్తున్నవారిపై ఆ భారం వేస్తే వారు ఇప్పుడే పారిపోతారు. 

కనుక కవిత ఈ ఆర్దిక భారం భరిస్తూనే, ఇతర పార్టీల ముఖ్య నేతలను ఆకర్షించగలగాలి. లేకుంటే ఆమె ఎక్కువ కాలం నిలద్రొక్కుకోవడం చాలా కష్టమే. 

ఈ రెండు పెద్ద సమస్యలను అధిగమించగలిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపిని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీని, పదేళ్ళు పాలనలో రాష్ట్ర రాజకీయాలపై పూర్తి పట్టు సాధించిన బీఆర్ఎస్‌ పార్టీని ఆమె ఒంటరిగా ఎదుర్కొని నిలబడాలి! ఎన్నికలలో వాటిని ఓడించాల్సి ఉంటుంది. ఇది ఇంకా అసాధ్యమే! 

ఇదివరకు విజయశాంతి, వైఎస్ షర్మిల, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌, నేటికీ కేఏపాల్, తీన్మార్ మల్లన్న వంటివారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. 

కనుక కల్వకుంట్ల కవిత చేస్తున్న ఈ రాజకీయ ప్రయోగం ఫలించడం చాలా కష్టమే అనిపిస్తుంది. ఒకవేళ ఈ ప్రయత్నంలో విఫలమైతే దీని కోసం ఖర్చు చేస్తున్న వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.



Related Post