కోలీవుడ్ మాస్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) ఈ నెల 9వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకుండా తొక్కి పట్టడంతో నేటికీ విడుదల కాలేదు.
నిన్న (మంగళవారం) మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా విజయ్ తరపు న్యాయవాది, సెన్సార్ బోర్డు తరపు న్యాయవాది మద్య వాడివేడిగా వాదోపవాదాలు జరిగాయి.
సెన్సార్ బోర్డు ఉద్దేశ్యపూర్వకంగా కుంటిసాకులతో సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయకుండా నిలిపివేసిందని విజయ్ తరపు న్యాయవాది సతీష్ పరాశరన్ వాదించారు. సెన్సార్ బోర్డు సూచించిన ప్రతీ అంశాన్ని ఎడిట్ చేసి మార్చడమో తొలగించడమో చేశామని చెప్పారు. కనుక సింగిల్ జడ్జ్ ఆదేశం ప్రకారం తక్షణమే తమ సినిమాకు యూ/ఏ సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పించి సినిమా విడుదలకు సహకరించాలని అభ్యర్ధించారు.
సెన్సార్ బోర్డు తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఏఆర్ఎల్ సుందరేశన్ కూడా దీటుగా వాదించారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బహుశః మూడు నాలుగు రోజులలో తీర్పు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ అనుకూలంగా వస్తే జన నాయగన్ ప్రేక్షకుల వద్దకు వస్తాడు. లేకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళక తప్పదు.