అవును. హైదరాబాద్‌లో కారు డ్రైవరుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి పిల్లలతో కలిసి నిద్రపోతున్న భార్య తలపై రోకలి బండతో బాది హత్య చేసి, “నా భార్యని ఇప్పుడే చంపేశా”నంటూ తన మొబైల్ ఫోన్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. ఈ ఘటన నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్గాంధీ నగర్‌లో సోమవారం రాత్రి జరిగింది.
పోలీసుల సమాచారం ప్రకారం, వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందినా ఆంజనేయులు, సరస్వతి దంపతులు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. వారికి ఓ కుమారుడు (12), కుమార్తె (9) ఉన్నారు. అతను క్యాబ్ డ్రైవరుగా పనిచేస్తుంటే, ఆమె హైటెక్ సిటీలో ఓ కంపెనీలో హౌస్ కీపింగ్ సూపర్ వైజర్‌గా చేస్తున్నారు. వారి ఆదాయం కుటుంబపోషణకి సరిపడక ఇబ్బంది పడుతున్నారు. కనుక ఆంజనేయులు ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేయాల్సి ఉండగా భార్యపై అనుమానంతో చేస్తున్న ఉద్యోగం మానేసి జులాయిగా తిరగడం మొదలుపెట్టాడు.
దీంతో ఆర్ధిక సమస్యలు ఇంకా పెరిగిపోయాయి. భర్తకి ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె పిల్లలిద్దరినీ చదువులు మాన్పించేసి నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్‌లోని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆంజనేయులు కొల్లాపూర్ వెళ్ళి భార్య, అత్తమామలకు నచ్చజెప్పి భార్యాపిల్లల్ని హైదరాబాద్ తీసుకువచ్చేశాడు. సోమవారం రాత్రి సరస్వతి డ్యూటీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత భర్త పిల్లలకు భోజనాలు పెట్టి నిద్రపోయింది.
ఆమె గాడ నిద్రలో ఉన్నప్పుడు ఆంజనేయులు రోకలి బండతో ఆమె తలపై బాది చంపేశాడు. తల్లి కేకలకు పక్కనే ఉన్న పిల్లలు మేల్కొని చూడగా రక్తం ఓడుతూ చనిపోయుంది. కానీ ఆమె నిద్రపోతోందని, మీరు కూడా నిద్రపొమ్మని ఆంజనేయులు వారికి నచ్చజెప్పబోయాడు. కానీ వారు భయంతో కేకలు వేస్తూ సమీపంలోనే నివసిస్తున్న మేనమామ ఇంటికి పరిగెత్తుకువెళ్ళి చెప్పారు.
అర్దరాత్రి రక్తంతో తడిసిన బట్టలతో వచ్చిన వారిని చూసి అతను కంగారు పడ్డాడు. విషయం తెలుసుకొని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈలోగా ఆంజనేయులు“నా భార్యని ఇప్పుడే చంపేశా”నంటూ తన మొబైల్ ఫోన్ స్టేటస్‌లో పెట్టుకున్నాడు. బోరబండ పోలీసులు అతనిని అరెస్ట్ చేసి సరస్వతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.