దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సంస్థలలో కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉపాధి, ఆదాయం పొందుతున్నారు. కానీ వారు రోజంతా కష్టపడి సంపాదిస్తే దానిలో 25 శాతం కమీషన్ ఆయా సంస్థలు తీసుకుంటాయి.
కానీ ప్రాణాలు పణంగా పెట్టి నిత్యం రోడ్లపై తిరుగుతూ వాటిలో సేవలు అందిస్తున్న రైడర్స్ (డ్రైవర్ల) పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. వారి సంపాదన వారి కుటుంబ పోషణకు కూడా సరిపోతుంది తప్ప పిల్లల చదువులు, వైద్యం వంటి ఇతర ఖర్చులకు ఏ మాత్రం సరిపోదు.
వారి సమస్యని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ని ప్రవేశపెడుతోంది. దీని కోసం ‘సహకార టాక్సీ కో ఆపరేటివ్ లిమిటెడ్’ అనే ఓ సంస్థ ఏర్పాటు చేసింది. దాని ఆధ్వర్యంలోనే ఇది పనిచేస్తుంది. భారత్ టాక్సీ కూడా బైక్, స్కూటీ, ఆటో, కార్లతో ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి సేవలే అందిస్తుంది. సేవలు అందిస్తుంది.
భారత్ టాక్సీ కొంత ఫీజు చెల్లించి సభ్యత్వ నమోదు చేసుకుంటే ఆ తర్వాత రైడర్లు ఎవరూ ఎవరికీ ఎటువంటి కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదు! ఎవరు ఎంత సంపాదించుకుంటారో అదంతా వారికే సొంతం.
ముందుగా 650 టాక్సీలతో ఢిల్లీలో భారత్ టాక్సీని ప్రయోగాత్మకంగా నడిపిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఏడాది డిసెంబర్ నుంచే దేశంలో అన్ని ప్రధాన నగరాలకు ఆ తర్వాత పట్టణాలకు విస్తరిస్తారు.