బస్సులో మొబైల్ ఫోన్స్ టపాసుల్లా పేలాయి

October 25, 2025
img

కర్నూలు పట్టణ శివారులో శుక్రవారం తెల్లవారు జామున వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ఫోరెన్సిక్ బృందాలు జరిపిన ప్రాధమిక విచారణలో మరో దిగ్బ్రాంతి కలిగించే విషయం బయట పడింది. 

పెట్రోల్ ట్యాంక్ పక్కన ఉండే బస్సు లగేజి కంపార్ట్మెంట్‌లో 400 కొత్త మొబైల్ ఫోన్స్ ఉన్న ఓ పెద్ద పెట్టె ఉంది. బస్సుని బైక్‌ డీకొన్నప్పుడు ముందుగా పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి దానిలో నుంచి పెట్రోల్ బయటకు కారడం మొదలైంది. ఆ సమయంలో బస్సు చాలా వేగంగా దూసుకుపోతుండటంతో చక్రాల కింద పడిన బైక్‌ని కొంత దూరం వరకు ఈడ్చుకు పోయింది. 

అప్పుడు నిప్పు రవ్వలు ఎగసిపడి ముందుగా పెట్రోల్ ట్యాంకుకి మంట అంటుకుంది. ఆ మంటలు పక్కనే ఉన్న లగేజి కంపార్ట్మెంట్‌కి వ్యాపించడంతో దానిలో ఉన్న మొబైల్ ఫోన్స్ బాంబుల్లా పెద్ద శబ్దం ప్రేలాయి. దాంతో క్షణాలలోనే బస్సు అంతటా మంటలు వ్యాపించాయి. 

ఒకవేళ అక్కడ మొబైల్ ఫోన్స్ లేకపోయి ఉంటే పెట్రోల్ ట్యాంకులో మంటలు పైకి వ్యాపించేందుకు మరికొంత సమయం పట్టి ఉండేది. ఆలోగా ప్రయాణికులు అందరూ తప్పించుకోగలిగేవారు. కానీ వారికి అవకాశం లేకుండా బస్సు కింద నిజమైన టైమ్‌ బాంబులు అమర్చి పేల్చినట్లు అన్నీ ఒకేసారి పేలాయి. అందువల్లే ఈ ప్రమాద తీవ్రత చాలా పెరిగిపోయిందని ఫోరెన్సిక్ ప్రాధమిక విచారణలో తెలిపినట్లు సమాచారం.

ప్రయాణికులను మాత్రమే తీసుకువెళ్ళడానికి అనుమతి కలిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో రకరకాల సరుకు రవాణా చేస్తుంటాయి. ఈ బస్సులో పేలిన మొబైల్ ఫోన్లే ఇందుకు నిదర్శనం. అందుకే విశాలమైన లగేజ్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. 

రవాణాశాఖ అధికారులకు ఈ విషయం సిబ్బందికి తెలియదనుకోలేము. కానీ బస్సు యజమానుల దురాశ, లంచాలకు ఆశపడే అధికారుల వలన ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. అయినా ప్రభుత్వాలు కటిన చర్యలు తీసుకోవు. కనుకనే ఇటువంటి విషాద ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి. 

Related Post