మొన్నటి వరకు టీజీఎస్ ఆర్టీసీ ఎండీగా పనిచేసి ఆ సంస్థను గాడిలో పెట్టి అందరి మెప్పు పొందిన వీసీ సజ్జనార్ మళ్ళీ చాలా కాలం తర్వాత పోలీస్ శాఖలోకి వచ్చేశారు. ఇటీవలే హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టారు.
కానీ సైబర్ నేరగాళ్ళు ఏమాత్రం భయపడకుండా ఆయన పేరు, ఫోటోతో నకిలీ డీపీ తయారుచేసుకొని ప్రజలకు ఫోన్లు, మెసేజులు చేస్తూ భయపెట్టి డబ్బు దోచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ విషయం ఆయనకు తెలియడంతో సోషల్ మీడియాలో ఆ పోస్ట్ క్లిప్పింగ్ పెట్టి తన పేరుతో ఎవరైనా ఫోన్లు చేసినా, మెసేజులు పెట్టినా పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే వీసీ సజ్జనార్ పేరుతోనే సైబర్ నేరగాళ్ళు ప్రజలను మోసం చేయాలనుకోవడం నిజంగా దుసాహసమే కదా? సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అ సైబర్ నేరగాళ్ళని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.