తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు, నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీలోవారి కుట్రలు కారణంగానే తాను ఓడిపోయానని అన్నారు. ఆమె వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్పందించలేదు కానీ ఆ ఎన్నికలలో ఆమెను ఓడించిన బీజేపి ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం ఘాటుగా స్పందించారు.
“మీ తండ్రిగారు ముఖ్యమంత్రిగా, మీ అన్నగారు మంత్రిగా పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించారు. అప్పుడు మీకు అమర వీరులు గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరించగానే వారికి అన్యాయం జరిగిందని మొసలి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అమర వీరుల కుటుంబాలను పట్టించుకోలేదని మీరు ప్రజలకు చెప్పడం కాదు... ఫామ్‌హౌసుకి వెళ్ళి ఎందుకు పట్టించుకోలేదని మీ తండ్రి కేసీఆర్‌ని నిలదీస్తే బాగుంటుంది.
మీ కుటుంబ అక్రమ సంపాదన వేల కోట్లలో నుంచి కొంత తీసి ఇప్పటికైనా అమరవీరుల కుటుంబాలను ఆదుకోవచ్చు కదా?కానీ మొసలి కన్నీళ్ళు కార్చితే సరిపోతుందా?
కల్వకుంట్ల కవిత ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే కేసీఆర్ పేరు, ఫోటో లేకుండా వెళితే ఎవరూ పట్టించుకోరు. రాష్ట్రమంతా తిరిగినా 400 ఓట్లు కూడా మీకు పడవు. అయినా ప్రజలు కేసీఆర్‌నే తిరస్కరిస్తే మిమ్మల్ని ఎందుకు ఆదరిస్తారు?” అని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటుగా విమర్శించారు.