హైదరాబాద్‌లో మరోసారి పేలిన తుపాకీ

October 26, 2025
img

హైదరాబాద్‌లో మరోసారి తుపాకీ పేలింది. శనివారం సాయంత్రం చాదర్‌ ఘాట్‌ వద్ద విక్టోరియా మైదానంలో ఇద్దరు దొంగలు మొబైల్ ఫోన్‌ దొంగలించి పారిపోతుంటే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న సౌత్ ఈస్ట్ రైల్వే జోన్‌ డీసీపీ చైతన్య, ఆయన గన్‌ మ్యాన్ వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నారు.

వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ దొంగ తన వద్ద ఉన్న కత్తితో గన్‌ మ్యాన్‌ని పొడవబోతే పక్కనే ఉన్న డీసీపీ చైతన్య తుపాకీతో మూడు రౌండ్లు కాల్చారు. ఈ కాల్పులలో దొంగకు చేతిపై, ఛాతి, పొట్టపై మూడు చోట్ల గాయాలయ్యాయి. వారు అతనిని అదుపులోకి తీసుకొని బంజారా హిల్స్ ఆస్పత్రికి తరలించారు.

ఈ సమాచారం అందుకున్నసౌత్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌ డీసీపీలు స్నేహ మెహ్రా, శిల్పావళి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ పెనుగులాటలో స్వల్పంగా గాయపడి, మలక్ పేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్యని, ఆయన గన్‌ మ్యాన్‌ని హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ పరామర్శించి అనంతరం ఈ కాల్పుల ఘటన గురించి మీడియాకు వివరించారు.

మొబైల్ ఫోన్‌ దొంగతనం చేసిన వ్యక్తిపై కాలాపత్తర్ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీటర్‌గా నమోదు అయ్యి ఉందని, అతనిపై 20కి పైగా కేసులున్నాయని తెలిపారు. మరొకరు రియల్ ఎస్టేట్ పంచాయితీలు చేస్తుంటారని తెలిపారు. డీసీపీ చైతన్య తన గన్‌ మ్యాన్ ప్రాణాలు కాపాడేందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు.                  

Related Post