తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం నిజామాబాద్ నుంచి జాగృతి జనం బాట కార్యక్రమం మొదలుపెట్టారు. సరిగ్గా ఇదే రోజున ఆమె భర్త అనిల్ కుమార్‌పై భూకబ్జా ఆరోపణలు వెలుగులోకి రావడం విశేషం.
బాలానగర్ మండలం పరిధిలోని ఐడిపిఎల్‌కు చెందిన 20 ఎకరాల భూమిని అనిల్ కుమార్, ఏవీ రెడ్డి అనే మరో వ్యక్తితో కలిసి కబ్జా చేశారని స్థానికులు మల్కాజ్ గిరీ ఎంపీ ఈటల రాజేందర్‌కు పిర్యాదు చేశారు. సర్వే నంబర్ 2010/4లో సుమారు రూ.2,000 కోట్లు విలువగల 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వారు ఆరోపించారు.
ఓవర్ లాపింగ్ సర్వే నంబర్లను ఆధారంగా వారిరువురూ నకిలీ పత్రాలు సృష్టించి అనిల్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే ఆ భూమిని ప్లాట్లుగా మార్చి అమ్మకాలు మొదలుపెట్టారని, అప్పుడే అక్కడ కొందరు ఇళ్ళ నిర్మించుకుంటున్నారని వారు ఈటల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్ళారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రిజిస్ట్రేషన్ జరిగిందని చెప్పారు. తాము హైడ్రా కమీషనర్ రంగనాథ్ ని కలిసి ఈ భూకబ్జా గురించి పిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.
ఈటల రాజేందర్ స్పందిస్తూ ఈ భూకబ్జా వ్యవహారంపై దర్యాప్తు చేయించి, ఒకవేళ కబ్జా జరిగినట్లు రుజువైతే అడ్డుకుంటానని స్థానికులకు హామీ ఇచ్చారు.
కల్వకుంట్ల కవిత సామాజిక తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలని కోరుతూ జాగృతి జనం బాట కార్యక్రమం మొదలుపెట్టగా ఈ ఆరోపణలు రావడంతో మీడియా ఆమెను ప్రశ్నించకుండా ఉండదు. కనుక ఇది ఆమెకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ ఆరోపణలపై కల్వకుంట్ల కవిత ఏమంటారో చూడాలి!