అమెరికాకు వాళ్ళ అవసరం లేదట!

September 24, 2025
img

మొదట సుంకాలతో యావత్ ప్రపంచ దేశాలను గడగడలాడించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇప్పుడు హెచ్-1బీ వీసాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో మరోసారి అందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

హెచ్-1బీ వీసా ఫీజుని ఒకేసారి లక్ష డాలర్లకు పెంచేయడం ద్వారా ఉద్యోగాల కోసం అమెరికాలో ఎవరూ అడుగుపెట్టలేని పరిస్థితి కల్పించారు.

ఇప్పుడు ‘లాటరీ సిస్టం’లో పెను మార్పులు చేస్తున్నారు. కనీసం ఏడాదికి 1,62,528 డాలర్ల వేతనం పొందబోతున్న అభ్యర్ధులకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, వారికి మాత్రమే లాటరీ సిస్టంలో నాలుగుసార్లు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అంతకంటే తక్కువ వేతనంతో ఉద్యోగాలలో చేరబోయేవారికి లాటరీ సిస్టంలో ఒక్కసారి మాత్రమే అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

తద్వారా దేశంలో అన్ని కంపెనీలు అమెరికన్ పౌరులను ఆ ఉద్యోగాలకు తీసుకోక తప్పదు. ఆ ఉద్యోగాలలో కూడా విదేశీ ఉద్యోగుల జీతభత్యాల పోటీ పడాల్సిన అవసరం లేకుండా అమెరికన్ పౌరులకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సూచించింది.  

ఇప్పటికే లక్ష డాలర్ల ఫీజుతో లక్షల మంది విదేశీ ఉద్యోగులు అమెరికాలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పుడు వీసాల జారీ లాటరీ సిస్టంలో ఈ మార్పులు చేసినట్లయితే కనీసం 50 -60 శాతం విదేశీ ఉద్యోగులను అడ్డుకోగలుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్‌ ప్రభుత్వం ఇవన్నీ ఖచ్చితంగా అమలు చేయగలిగితే భారత్‌తో ప్రపంచదేశాలకు అమెరికాలో ఉద్యోగావకాశాలు తగ్గి ఆ మేరకు అమెరికా పౌరులకు ఉద్యోగాలు లభిస్తాయి. అమెరికాకు సాధారణ ఉద్యోగుల అవసరం లేదని ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. కనుక అమెరికా వెళ్ళి స్థిరపడాలనుకుంటున్న భారతీయ టెకీలు వేరే దారి చూసుకోవడం మంచిది.

Related Post