కోట్లాది హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమలలో జరుగుతున్న అపచారాల గురించి వింటున్నప్పుడు భక్తుల మనసులు చివుక్కుమనక మానవు.
స్వామివారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం, గోశాలలో గోవులు చనిపోవడం, టీటీడీలో అన్యమతస్థులు పనిచేస్తుండటం, తిరుమలలో మద్యం, మాంసాహారం వంటివన్నీ భక్తులను నొప్పించేవే!
తాజాగా స్వామివారి హుండీ కానుకలను లెక్కించే పరకామణిలో రవికుమార్ అనే ఉద్యోగి ఏళ్ళ తరబడి దొంగతనం చేస్తూ వందల కోట్లు కాజేసి పట్టుబడటం, దానికి పరిహారంగా అతను టిటిడీకి సుమారు వంద కోట్లు విలువగల ఆస్తులు గిఫ్ట్ డీడ్ ద్వారా కానుకగా ఇచ్చి టిటిడీతో రాజీ కుదుర్చుకొని ఈ కేసు నుంచి బయటపడటం గురించి తెలిసి శ్రీవారి భక్తులు షాక్ అవుతున్నారు.
ఈ వ్యవహారంలో దొంగని, అతనికి సహకరించినవారిని అరెస్ట్ చేసి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే బదులు, దీనిపై ఏపీలో కూటమి ప్రభుత్వం-వైసీపీ చేస్తున్న రాజకీయాలు భక్తులను ఇంకా నొప్పిస్తున్నాయి. ఇప్పుడీ వ్యవహారం హైకోర్టు జోక్యం చేసుకొని సీఐడీ విచారణకు ఆదేశించింది.