కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసిన తర్వాత ముందుగా సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘాన్ని తన అధీనంలో తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆమె అమెరికా పర్యటనకి వెళ్ళినప్పుడు ఆమెను గౌరవ అధ్యక్ష పదవిలో నుంచి తొలగించి కొప్పుల ఈశ్వర్‌ని నియమించడం ద్వారా ఆమెకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
అందుకు నిరసనగా టిజీబీకేఎస్ నుంచి కొందరు కార్మిక నేతలు రాజీనామాలు చేశారు. తాము కల్వకుంట్ల కవిత వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ఆమె చాలా తీవ్రంగా స్పందిస్తారనుకుంటే మౌనంగా ఉండిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె వెనక్కు తగ్గారో లేదో తెలియదు కానీ కొప్పుల ఈశ్వర్ మాత్రం సింగరేణిలో దూసుకుపోతున్నారు.
శుక్రవారం ఆయన నేతృత్వంలో టిజీబీకేఎస్ సభ్యులు సింగరేణి భవన్ ముట్టడించారు. సింగరేణి లాభాల్లో తమకు 35 శాతం వాటా ఇవ్వాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఏటా సింగరేణి సంస్థ దసరా ముందు కంపెనీ నివేదికలో ఎంత లాభం వచ్చిందో ప్రకటించి దానిలో కార్మికులకు ఎంత శాతం ఇవ్వబోతోందో తెలియజేస్తుంటుంది. ఆ తర్వాత దసరా, దీపావళి పండుగలకు బోనస్ రూపంలో అది ఇస్తుంటుంది.
అయితే కొప్పుల ఈశ్వర్ ఈ హడావుడి కార్మికుల కోసమా లేదా ఈవిదంగా కల్వకుంట్ల కవితకు చెక్ పెట్టి టిజీబీకేఎస్ పట్టు సాధించడానికా? అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభించవచ్చు.