ట్రంప్‌: మరో సంచలన నిర్ణయం!

September 20, 2025
img

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ యావత్ ప్రపంచదేశాలపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు. తన నిర్ణయాలతో తన దేశానికి, అమెరికన్ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నానని ట్రంప్‌ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే రోజుకో సంచలన నిర్ణయంతో ప్రపంచదేశాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. 

హెచ్1 బీ వీసా ఫీజును ఒకేసారి 5-6 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్లకు పెంచేసి భారత్‌, అమెరికా ఐటి కంపెనీలకు వెన్నులో వణుకు పుట్టించిన ట్రంప్‌, ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

ఇంతకాలం తమ దేశంలో శరణార్ధులుగా ఉంటున్న సిరియన్ల రక్షణకు నిర్దేశించిన తాత్కాలిక రక్షణ చట్టాన్ని రద్దు చేశారు. అమెరికాలో ఉంటున్న వేలాదిమంది సిరియన్లు 60 రోజులలో అమెరికా విడిచి స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు. ఒకవేళ వెళ్ళకపోతే అరెస్ట్‌ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రంప్‌ హెచ్చరించారు.

ఐసిస్ ఉగ్రవాదులు-అమెరికా-ఇజ్రాయెల్ సేనలకు మద్య జరుగుతున్న అంతర్యుద్ధంతో వేలాదిమంది సిరియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వివిధ దేశాలకు పారిపోయారు. అలా కొంతమంది అమెరికా చేరుకొని అక్కడ శరణార్ధుల శిబిరాలలో తల దాచుకుంటున్నారు. 

ఇప్పుడు వారందరూ తప్పనిసరిగా సిరియాకు తిరిగి వెళ్ళిపోకతప్పదు. సిరియాలో సర్వస్వం కోల్పోయిన వారు ఇప్పుడు కట్టుబట్టలతో తిరిగి వెళితే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో ఊహించుకోవచ్చు. 

కానీ అమెరికాలో హెచ్1 బీ వీసాలతో పనిచేస్తున్న ఐటి నిపుణులు, వైద్య నిపుణులు, అమెరికన్ యూనివర్సిటీలలో చదువుకోవడానికి వచ్చిన విదేశీ విద్యార్ధులనే ట్రంప్‌ భరించలేకపోతున్నప్పుడు సిరియన్ శరణార్ధులను భారిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది.

Related Post