రంగస్థలంతో తన సత్తా చాటుకున్న సుకుమార్ ఆ తర్వాత పుష్ప-1,2లతో మరోసారి తనకు తిరుగు లేదనిపించుకున్నారు. దర్శకుడుగానే కాక నిర్మాతగా కూడా సుకుమార్ తన సత్తా నిరూపించుకున్నారు.
కుమారి 21ఎఫ్, ఉప్పెన, విరూపాక్ష, 18 పేజెస్, తాజాగా తన కుమార్తె ప్రదాన పాత్రలలో గాంధీతాత చెట్టు వంటి చక్కటి సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం బుచ్చిబాబు సనా, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తీస్తున్న పెద్ది సినిమా కూడా సుకుమార్ భాగస్వామ్యంతోనే నిర్మిస్తున్నారు. దాంతో బాటు నాగ చైతన్య-కార్తీక్ దండు కాంబినేషన్‌లో మరో సినిమాలో కూడా సుకుమార్ భాగస్వామిగా ఉన్నారు.
ఈ రెండు పూర్తయ్యాక సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్‌తో మరో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పని మొదలుపెట్టేశారు. ప్రీ-విజువలైజేషన్ పనులు కూడా జరుగుతున్నాయి.
రామ్ చరణ్ పెద్ది పూర్తిచేసి బయటకు రాగానే ఇది మొదలుపెట్టబోతున్నారు. అల్లు అర్జున్‌తో పుష్ప-3 తీయాల్సి ఉంది కానీ అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీతో ఓ భారీ బడ్జెట్ సినిమాతో లాక్ అయిపోయి ఉన్నారు. కనుక ఆలోగా రామ్ చరణ్‌తో మరో సినిమా పూర్తిచేయాలని సుకుమార్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.