రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఆయన స్వీయ దర్శకత్వంలో చేసిన ‘కాంతార’ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా కాంతార: ఛాప్టర్ 1ని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీశారు. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. కనుక రేపు (సోమవారం) ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయబోతున్నారు.
తెలుగు వెర్షన్ ట్రైలర్ ప్రభాస్, తమిళ్ వెర్షన్ శివకార్తికేయాన్, మళయాళ వెర్షన్ పృధ్వీరాజ్ సుకుమారన్, కన్నడ వెర్షన్ రిషబ్ శెట్టి, హిందీ వెర్షన్ హృతిక్ రోషన్ విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాని బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా డబ్ చేసి అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు.
కాంతార: ఛాప్టర్ 1 కోసం 25 ఎకరాలలో ఒక పట్టణం సెట్స్ వేసి దానిలో 50 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఈ సెట్స్‌లోనే 3,000 మంది ప్రజలు, 500 మంది స్టంట్ మ్యాన్ పాల్గొన్నారని చిత్రబృందం తెలిపింది. ఇప్పటి వరకు వచ్చిన భారతీయ సినిమాలో అతిపెద్ద యుద్ధ సన్నివేశాలలో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందని తెలిపారు.
ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జంటగా రుక్మిణీ వసంత్ నటించగా జయరాం, రాకేశ్ పూజారి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రిషబ్ శెట్టి; సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్; సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్ చేశారు.