ఓజీ... తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ!

September 20, 2025


img

సుజీత్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక మోహన్ జంటగా చేసిన ‘ఓజీ’ ఈ నెల 25న విడుదల కాబోతోంది. కనుక నిర్మాతల అభ్యర్ధన మేరకు తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 24న ప్రీమియర్ షో ప్రదర్శనకు, 25 నుంచి మొదటి 10 రోజులు టికెట్ ఛార్జీల పెంపుకి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. 

దాని ప్రకారం సినిమా ప్రీమియర్ షో టికెట్ ఛార్జీ జీఎస్టీతో కలిపి రూ.800 చొప్పున పెంచుకునేందుకు అనుమతించింది. ఈ నెల 25న సినిమా విడుదలైన రోజు నుంచి అక్టోబర్ 4 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.100, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.150 చొప్పున పెంచుకునేందుకు అనుమతించింది. 

ఏపీ ప్రభుత్వం కూడా ఓజీ టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు జీవో జారీ చేసింది. కానీ ఏపీలో తన అభిమానులపై డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ మరింత భారం మోపారు. 25 అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ఛార్జీ జీఎస్టీతో కలిపి రూ.1,000, మర్నాటి నుంచి అక్టోబర్ 4వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో జీఎస్టీతో కలిపి రూ.125, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.150 చొప్పున అధనంగా పెంచుకునేందుకు అనుమతించింది. 

ఓజీలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో దీనిని నిర్మించారు. 




Related Post

సినిమా స‌మీక్ష