తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ముఖ్యంగా తెలంగాణ మహిళల భక్తిశ్రద్దలు, వారి మనోభావాలకు అద్దం పట్టే బతుకమ్మ పండగ నేటి (మహాలయ అమావాస్య) నుంచి ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల పండగ నేడు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమైంది.
ఆ తర్వాత రేపటి నుంచి వరుసగా అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానాబియ్యంల బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకువ్వ బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, చివరిగా ఈ నెల 30న దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ నిమజ్జనంతో వైభవంగా ముగుస్తుంది.
బతుకమ్మ పండుగలో ప్రతీ అంశానికి చాలా విశిష్టత ఉంది.
బతుకమ్మకు ఉపయోగించే తంగెడు, గున్నెపూ, బంతి, చామంతి, కాసరపువ్వు వంటివన్నీ ఔషాద గుణాలున్నవే. వీటితో చేసిన బతుకమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బతుకమ్మ పండగలో మహిళలు ఆట,పాటలు చాలా కీలకం.
ప్రతీరోజూ సాయంత్రం ఇళ్ళ ముంగిట ముగ్గులు వేసి మద్యలో బతుకమ్మ పెట్టి మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ దాని చుట్టూ లయబద్దంగా తిరుగుతారు. ఈ ఆటపాటలతో దైనందిన జీవితంలో అలసిపోయే మహిళలకు మళ్ళీ నూతనోత్సాహం కలుగుతుంది.
ముఖ్యంగా ఈ పండగని మహిళలు అందరూ కలిసి జరుపుకోవడం వలన వారి మద్య స్నేహ సంబంధాలు పెరిగి సామాజిక ఐక్యత ఏర్పడుతుంది. మనమందరం ఒక్కటే ఒకరికొకరు తోడున్నామనే భావనతో చాలా ఉపశమనం కలిగిభిస్తుంది. బతుకమ్మ పండగలో ఇంత పరామర్ధం ఉంది. అందుకే బతుకమ్మ పండగని మహిళా సాధికారికతకు ప్రతీకగా భావిస్తారు.