బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరింపబడిన కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రెస్‌మీట్ పెట్టి మళ్ళీ సంచలన విషయాలు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరుగుతున్నాయని తాను అప్పుడే అనుమానించి రామన్నని హెచ్చరించానని చెప్పారు. కానీ పట్టించుకోలేదన్నారు. అదే ఇప్పుడు కొంప ముంచుతోందన్నారు.
కాళేశ్వరం విషయంలోనే తాను హరీష్ రావుని వ్యతిరేకిస్తున్నానని, ఆయన పీసీ ఘోష్ కమీషన్ ఎదుట విచారణకు హాజరైనప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు.
నేటికీ హరీష్ రావు, సంతోష్ రావుల అనుచరులు సోషల్ మీడియాలో తనపై దాడులు చేస్తూనే ఉన్నారని, కానీ కేసీఆర్, కేటీఆర్ వారిని నియంత్రించకపోవడం బాధ కలిగిస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది తనతో టచ్‌లో ఉరంటూ కల్వకుంట్ల కవిత మరో బాంబు పేల్చారు. కానీ వారి పేర్లు బయటపెట్టడానికి ఇది తగిన సమయం సందర్భంగా కావన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు. కొత్త పార్టీ పెట్టడం లేదని కవిత మరోసారి స్పష్టం చేశారు.
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నా దాని వలన తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందని తెలిసి ఉన్నా సిఎం రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని కల్వకుంట్ల కవిత విమర్శలు చేశారు.
బీసీ రిజర్వేషన్స్ అంశంపై కలిసి వచ్చే పార్టీలతో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పారు. రాజకీయాలలో ఎవరూ ఎవరికీ స్పేస్ ఇవ్వరని తొక్కుకుంటూ ముందుకు సాగిపోవాల్సిందేనన్నారు. తద్వారా ఆమె కూడా ఇదే పద్దతిలో ముందుకు సాగాబోతున్నారని స్పష్టం చేసినట్లే భావించవచ్చు.