మావోయిస్ట్ కేంద్రం కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఇటీవల ఓ లేఖ విడుదల చేశారు. దానిలో తాము ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు సిద్దంగా ఉన్నామని అభయ్ పేర్కొన్నారు.
కానీ ముందుగా దీనిపై తాము అంతర్గతంగా చర్చించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తమకు ఒక నెల సమయం ఇవ్వాలని కోరారు. అంతవరకు కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ పాటించాలని కోరారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సూచన మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ లేఖలో అభయ్ పేర్కొన్నారు.
కానీ శుక్రవారం మావోయిస్టులు మరో లేఖ విడుదల చేశారు. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదల చేసిన ఆ లేఖలో అభయ్ లేఖ అయన వ్యక్తిగతం. ఆ లేఖ మావోయిస్ట్ పార్టీకి నష్టం కలిగించే విదంగా ఉంది. దాంతో మావోయిస్ట్ పార్టీకి సంబంధం లేదు. అనారోగ్య కారణాలతో కొందరు పోలీసులకు లొంగి పోతున్నారు. కానీ దానర్ధం మా పోరాటాలు నిలిచిపోయాయని లేదా మేము బలహీన పడ్డామని కాదు. ప్రజాభిప్రాయం కోరుతూ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం చాలా అర్ధరహితంగా ఉంది. ఇటువంటి లేఖ విడుదల చేసే ముందు అయన పార్టీని సంప్రదించి ఉండి ఉంటే బాగుండేది.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను ఏరివేసేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ బేషరతుగా నిలిపివేస్తేనే శాంతి చర్చలు సాధ్యం. మావోయిస్ట్ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు ఎదురుకాల్పుల్లో మృతి చెందక ముందే మేము కేంద్రంతో శాంతి చర్చలకు సిద్దమని తెలియజేశాము. కానీ ఓ పక్క మా రక్తం ఏరులైపారిస్తూ శాంతి చర్చలకు రమ్మంటే ఎలా వస్తాము?” అని తాజా లేఖలో పేర్కొన్నారు.