అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకి ఇప్పటికే ప్రపంచ దేశాలు గడగడలాడుతున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం ప్రకటిస్తారో? ఎవరిపై విరుచుకుపడతారో తెలీని పరిస్థితి!
ట్రంప్ తాజాగా హెచ్1 బీ వీసాలపై కొరడా ఝళిపించారు. ఈ వీసాల ఫీజు లక్ష డాలర్లుగా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఇదేదో ఒక్కసారి కట్టేస్తే సరిపోదు. ప్రతీ ఏడాది లక్ష డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.88 లక్షలు ఫీజు చెల్లించాల్సిందే.
కనుక అమెరికాలోని కంపెనీలపై ట్రంప్ ఒకేసారి ఇంత పెనుభారం మోపడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి! విదేశీ ఉద్యోగులను తొలగించి, వారి స్థానాలలో అమెరికన్లను నియమించుకుంటే ఈ భారం ఉండదని ట్రంప్ ఉచిత సలహా ఇచ్చారు. అలాగని వారు విదేశీ ఉద్యోగులకు ఇచ్చే జీతాలకు పనిచేయరు. కనుక అమెరికన్ ఉద్యోగులకు కనీసం పది రెట్లు ఎక్కువ జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. పైగా విదేశీ ఉద్యోగుల్లా అదనపు పని గంటలు, పని ఒత్తిడి తీసుకునేందుకు అంగీకరించరు. కనుక ట్రంప్ నిర్ణయంతో అమెరికాలో కంపెనీల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారింది.
కనుక ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడేందుకు అవి ఏం చేస్తాయి? ముందుగా విదేశీ ఉద్యోగులను కొంత తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. తర్వాత అమెరికాలో తమ కార్యకలాపాలు బాగా తగ్గించేసి భారత్ తదితర దేశాలలో కొనసాగించవచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఈ వీసా ఫీజుల భారాన్ని అంతిమంగా అవి మళ్ళీ అమెరికన్ ప్రజలకే బదిలీ చేయడం ఖాయం. కనుక ట్రంప్ నిర్ణయం సగటు అమెరికన్లకు కూడా భారంగా మారే అవకాశం ఉంది.