హైదరాబాద్‌లో చారిత్రిక ప్రాశస్త్యం కలిగిన గోల్కొండ కోట నుంచి ఇబ్రహీం బాగ్ వద్ద గల కుతుబ్ షాహీ సమాధుల వరకు ‘రోప్ వే’ ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ సన్నాహాలు మొదలుపెట్టింది.
కానీ ఈ మార్గంలో రక్షణశాఖకు చెందిన స్థలాలున్నందున ఈ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలు, ప్రత్యామ్నాయాలు, నిర్మాణ వ్యయం వగైరాలతో సమగ్ర నివేదిక సమర్పించేందుకు టెండర్లు పిలిచింది.
ఈ రంగంలో అపారమైన అనుభవం ఉన్న నైట్ ఫ్రాంక్ అనే సంస్థ ఈ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇది సమర్పించే డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ఆధారంగా పిపిపి పద్దతిలో రోప్ వే నిర్మించాలని హెచ్ఎండీఏ భావిస్తోంది.
గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ సమాధులు సుమారు 1.5 కిమీ దూరంలో ఉన్నాయి. కానీ రోడ్డు మార్గంలో నిత్యం చాలా రద్దీగా ఉంటుంది కనుక కోట నుంచి అక్కడికి చేరుకోవాలంటే సుమారొ ఓ ముప్పావు గంట సమయం పడుతుంది. కనుక చాలా మంది పర్యాటకులు గోల్కొండ కోట చూసి తిరిగి వెళ్ళిపోతుంటారు
ఈ రోప్ వే అందుబాటులోకి వస్తే గోల్కొండ నుంచి కేవలం 10 నిమిషాలలో సమాధుల వద్దకు చేరుకోవచ్చు. పైగా ఆకాశమార్గంలో ప్రయాణం గొప్ప అనుభూతినిస్తుంది కూడా. కనుక ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి మరో ప్రత్యేక ఆకర్షణగా మారుతుంది.