హైదరాబాద్‌లో ఏమిటీ దుస్థితి!

September 23, 2025
img

దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్‌ కూడా ఒకటి. అనేక అంతర్జాతీయ కంపెనీలు, వాణిజ్య సంస్థలు, అభివృద్ధికి నిదర్శనంగా 30-40 అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. ఇంతగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరంలో ఓ మోస్తరు వర్షం పడితే చాలు రోడ్లన్నీ జలమయం అయిపోతాయి. ఇక భారీ వర్షాలు పడితే ఆఫీసులు మూసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోక తప్పని పరిస్థితి. 

సోమవారం రాత్రి కుండాపోతగా కురిసిన వర్షానికి నగరంలో పలు ప్రధాన కూడళ్ళలో సైతం భారీగా నీళ్ళు చేరాయి. నిన్న రాత్రి బంజారాహిల్స్‌లో గరిష్టంగా 10.3, శ్రీనగర్ కాలనీలో 9.7, ఖైరతాబాద్ 8.33 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో పలు కాలనీలలోకి నీళ్ళు ప్రవహించాయి. 

నగరం నడిబొడ్డున ఉన్న అమీర్ పేట్‌ పక్కనే ఉన్న ఎల్లారెడ్డి గూడెం అయితే చెరువులా మారిపోయింది. మోకాలులోతు నీళ్ళు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు.      

తుర్కయాంజిల్లోని ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్ నీటితో నిండిపోవడంతో దానిలో నివసిస్తున్నవారందరూ ఇళ్ళకు తాళాలు వేసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళారు. హయత్ నగర్‌ బంజారాకాలనీలో ఇళ్ళలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, సిద్ధిపేట, జనగామ, ములుగు, నిర్మల్ జిల్లాలలో కూడా సోమవారం రాత్రి కుండపోతగా వాన కురిసింది. అనేక ప్రాంతాలలో పంటలు నీట మునిగాయి.

ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో వాహనాలు, పశువులు కొట్టుకుపోయాయి. ములుగు జిల్లా చల్పాక గ్రామంలో కృష్ణ (50) అనే రైతు, వరంగల్ జిల్లా ముస్కు చంద్రయ్యప్ల్లి గ్రామంలో రాకేశ్ (25) అనే యువకుడు పిడుగుపడి చనిపోయారు. నేడు, రేపు కూడా హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలు జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Related Post