సింగరేణి దీపావళి బోనస్ 34 శాతం

September 23, 2025


img

సిఎం రేవంత్ రెడ్డి సింగరేణి బొగ్గుగనుల కార్మికులకు 34 శాతం దీపావళి బోనస్ ప్రకటించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో (2024-25)లో సింగరేణికి రూ.6,394 కోట్లు లాభం వచ్చింది. దానిలో 34 శాతం అంటే రూ.802 కోట్లు కార్మికులకు బోనస్‌గా ఇవ్వబోతున్నామని ప్రకటించారు.

ఈసారి కూడా కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ రూ.5,500 చొప్పున బోనస్ ఇస్తామని ప్రకటించారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సింగరేణి ఎండీ బలరాం తదితరులతో కలిసి సోమవారం సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ ప్రకటన చేశారు. 

సింగరేణిలో రెండు బ్లాకులలో బొగ్గు తవ్వకం కాంట్రాక్ట్ కోసం జరిగిన వేలంపాటలో సంస్థను పక్కన పెట్టి బీఆర్ఎస్‌ పార్టీకి సన్నిహితులైన ఇద్దరికి దక్కేలా చేశారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఆ టెండర్లు, కాంట్రాక్ట్ రద్దు చేసి వాటిని సింగరేణికి అప్పగించాలని సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర బొగ్గుశాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. సింగరేణికి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, వాటికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను త్వరలో పరిష్కరిస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.7,000 కోట్లు ఆదాయం తగ్గిపోయిందని, కనుక కేంద్ర ప్రభుత్వమే దీనిని భర్తీ చేయాలని సిఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


Related Post