నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కీ శుక్రవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. మొదట కుల్మన్ ఘీసింగ్ పేరు ఖరారు అయినట్లు వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఆయన స్థానంలో జస్టిస్ సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా నియమిస్తున్నట్లు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రకటించారు.
నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పుడు నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా జస్టిస్ సుశీలా కార్కీ నిలిచారు. ఆమె తొలి మంత్రివర్గ సమావేశంలోనే ప్రస్తుత పార్లమెంట్ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలనే ‘జెన్ జెడ్’ ఆందోళనకారులు షరతుని అధ్యక్షుడు అంగీకరించడంతో ఆమె నియామకానికి మార్గం సుగమం అయ్యింది.
జస్టిస్ సుశీలా కార్కీ 1975లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. తర్వాత తన స్వదేశం నేపాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసి గత 32 ఏళ్ళుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. తొలిసారిగా 2009లో ఆమె నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
మరుసటి సంవత్సరంలోనే ఆమె శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె 2016లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి కొంతాకాలం క్రితం పదవీ విరమణ చేశారు. భారత్ పట్ల ఆమె చాలా సానుకూలంగా ఉంటారు. ప్రధాని మోడీతో సత్సంబంధాలున్నాయి. కనుక భారత్ ప్రభుత్వం ఆమె ఆ పదవిలో నిలదొక్కుకోవడానికి సాయపడే అవకాశం ఉంది.