సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కాళేశ్వరం కేసులో పీసీ ఘోష్ కమీషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికను కొట్టివేయాలని దాని ఆధారంగా తనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె హైకోర్టుని అభ్యర్ధించారు. ఈ కేసు విచారణ కొరకు పీసీ ఘోష్ కమీషన్ తనకు నోటీసు జారీ చేసి విచారణ జరపడాన్ని కూడా ఆమె తప్పు పట్టారు.
ఆమె పిటిషన్‌ని హైకోర్టు రిజిస్ట్రీ స్వీకరించింది. దానిని విచారణకు స్వీకరిస్తే త్వరలోనే విచారణ జరుగుతుంది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషీ కూడా ఈ కేసులో చిక్కుకున్నారు. కనుక ఇటీవల ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు స్మితా సభర్వాల్ కూడా ఈ కేసు నుంచి ఉపశమనం కొరకు హైకోర్టుని ఆశ్రయించారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ మూడు వారాల క్రితం కేంద్ర హోమ్ శాఖకు లేఖ వ్రాసింది. కానీ కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది. ఒకవేళ సీబీఐ విచారణ మొదలుపెట్టకపోతే తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు విచారణని సీఐడీ లేదా సిట్‌కు అప్పగించే అవకాశం ఉంది.