బీఆర్ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత బహిష్కరించబడిన తర్వాత ఆమె పార్టీ ప్రాధమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు.
స్పీకర్ ఫార్మాట్‌లో పంపిన రాజీనామా లేఖను ఆమోదించాల్సిందిగా తాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఫోన్ చేసి కోరానని చెప్పారు. కానీ ఇంతవరకు ఆయన ఆమోదించకపోవడంతో ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఆలోచన ఉందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మీడియాలో వస్తున్న ఈ ఊహాగానాలపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ, “ఆమె రాజీనామా లేఖ ఇంకా నా వద్దనే ఉంది. ఆనాడు ఆమె ఆవేశంలో తొందరపాటుతో రాజీనామా చేసి ఉండవచ్చనే ఉద్దేశ్యంతో దానిని ఆమోదించలేదు.
ఓ సారి పునరాలోచించుకోవాలని ఆమెకు సూచించాను. ఒకవేళ ఆమె రాజీనామాకే మొగ్గు చూపితే ఆమోదించక తప్పదు. కాదనడానికి ఎటువంటి కారణమూ లేదు,” అని అన్నారు. కనుక బంతి ఇప్పుడు కల్వకుంట్ల కవిత కోర్టులోనే ఉన్నట్లు భావించవచ్చు.