అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అత్యున్నత నోబుల్ శాంతి బహుమతి కోసం ఎంతగా ఆరాటపడినప్పటికీ, ఎంతగా ఒత్తిళ్ళు చేసినప్పటికీ అది వెనిజువెలకు చెందిన మరియా కోరినా మచాడోకు లభించింది. నోబుల్ బహుమతి కోసం మొత్తం 338 నామినేషన్స్ రాగా వారిలో మరియా కోరినాను నోబుల్ కమిటీ ఎంపిక చేసింది.
ఆమె వెనిజువెల ప్రజల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేశారు. ఈ క్రమంలో అనేకసార్లు ప్రాణహాని, బెదిరింపులు, వేధింపులు వంటివన్నీ ఆమె ఎదుర్కొన్నారు. ఈ కారణంగా ఆమె ఏడాదిగా అజ్ఞాతంలో ఉంటూ పోరాటాలు కొనసాగించారు.
వెనిజువెలలో ప్రజాస్వామ్య పునరుద్దరణ, శాంతి, ప్రజల హక్కుల కోసం ఆమె చేసిన కృషికి గుర్తించిన నోబుల్ కమిటీ ఈ అత్యున్నత పురస్కారానికి ఆమెని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను ఏడు యుద్ధాలు ఆపానని పదేపదే చెప్పుకుంటూ, ఈ అత్యున్నత నోబుల్ శాంతి బహుమతికి తనకంటే అర్హులు మరెవరూ ఉండరని చెప్పుకునేవారు. కనుక తనకు ఇవ్వాలని పదేపదే ప్రత్యక్షంగా, పరోక్షంగా విజ్ఞప్తి చేశారు. పలువురు ప్రముఖులతో లాబీయింగ్ కూడా చేయించారు.
కనుక ఈసారి ఆయనకు తప్పకుండా నోబుల్ బహుమతి లభిస్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ తాము ఇటువంటి లాబీయింగ్, ఒత్తిళ్ళు, మీడియాలో వస్తున్న వార్తలు, ప్రచారానికి లొంగబోమని నార్వేకు చెందిన ఐదుగురు సభ్యుల నోబుల్ కమిటీ ముందే చెప్పింది. చెప్పినట్లుగానే ట్రంప్ ఒత్తిళ్ళను పట్టించుకోకుండా మరియా కోరినా మచాడోకు ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.